కలం, వెబ్‌డెస్క్: భారతీయ సనాతన ధర్మంలో ఆధ్యాత్మికతకు, దైవత్వానికి అత్యున్నత స్థానం ఉంది. దేవునికి, భక్తునికి మధ్య వారధిగా నిలిచే పూజారి (అర్చక) వృత్తిని సమాజంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. సాధారణంగా మన దేశంలోని మెజారిటీ ఆలయాల్లో పురుషులే అర్చకులుగా కనిపిస్తుంటారు. అయితే దేవాలయాల్లో మహిళలు పూజారులు (Women Priests) గా ఉండవచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు శాస్త్రాలు ఏం సమాధానం చెబుతున్నాయి అనే విషయాన్ని ప్రఖ్యాత జ్యోతిష్కుడు, వాస్తు నిపుణుడు డాక్టర్ బసవరాజ్ గురూజీ ఓ కార్యక్రమంలో వివరించాడు.
పురోహిత వృత్తిలో స్త్రీ, పురుష అనే భేదం లేదని ఆయన పేర్కొన్నారు. పండితుడు, పురోహితుడు, పూజారి అనే పేర్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక సేవలో లింగభేదానికి చోటు లేదని చెప్పారు. దేవాలయ పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, ప్రతిష్ఠాపనలు వంటి ధార్మిక కార్యక్రమాలను మహిళలు కూడా పూర్తిస్థాయిలో నిర్వహించవచ్చని ఆయన వివరించారు.
ఇలాంటి బాధ్యతలను నిర్వర్తించడానికి ముఖ్యమైనది లింగం కాదు, అర్హత అని గురూజీ అభిప్రాయపడ్డారు. సహనం, శాంతి, స్వచ్ఛమైన మనస్సు, ఆధ్యాత్మిక అవగాహన వంటి లక్షణాలు ఉన్నవారే నిజమైన అర్హులని సూచించారు. ఈ గుణాలు మహిళల్లో సహజంగానే ఎక్కువగా కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
మహిళల ఆధ్యాత్మిక సామర్థ్యానికి నిదర్శనాలు
వేదాలు, పురాణాలు కూడా స్త్రీల ఆధ్యాత్మిక ప్రతిభను గొప్పగా కొనియాడాయని తెలిపారు. వేదకాలంలో మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి మహావిదుషీలు వేద జ్ఞానంలో అపూర్వమైన ప్రావీణ్యం సంపాదించారు. యజ్ఞవల్క్య మహర్షితో తాత్విక చర్చలు జరిపిన మైత్రేయి, వేద సూక్తులను రచించిన లోపాముద్ర వంటి మహనీయులు మహిళల ఆధ్యాత్మిక సామర్థ్యానికి నిదర్శనాలుగా నిలిచారు అని గురూజీ తెలిపారు.

