Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రైవేట్ పాఠశాలల గోదాములను ముట్టడిస్తాం.. బీఆర్ఎస్వీ హెచ్చరిక

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యను సేవా దృక్పతంతో చూడకుండా ఒక వ్యాపారంగా మార్చి.. నిరుపేద విద్యార్థుల రక్తం తాగుతున్నారని కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ (Anil Kumar Goud) మండిపడ్డారు. గత రెండు రోజుల క్రితం డీఈఓను కలిసి.. ప్రైవేట్ పాఠశాలలో దోపిడీకి సంబంధించిన సమగ్ర నివేదికను తయారుచేసి ఇస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం బుధవారం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ నేతలు డీఈఓను కలిసి ప్రైవేట్ పాఠశాలలు అక్రమంగా పుస్తకాలను అమ్ముతున్న గోదాముల వివరాలు, పుస్తక నిల్వలకు సంబంధించిన సమగ్ర నివేదిక తయారు చేసి వారికి అందించారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘విద్యా వ్యవస్థల్లో నెలకొన్న సమస్యలు.. వాటిపై మీ స్పందన’ అనే కార్యక్రమం ద్వారా మొదటగా జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని వివరించామని అన్నారు. రెండు రోజుల్లో విద్యాశాఖ నుండి ఎలాంటి చర్యలు చేపట్టకపోతే.. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో.. ప్రైవేటు పాఠశాల పుస్తక గోదాములను ముట్టడిస్తామని హెచ్చరించారు. నాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వ పాఠశాలలతో పాటు గురుకులాల్లో అన్ని వసతులు ఉండి.. విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించే వారన్నారు.

కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పాఠశాలలో కనీస వసతులు లేక ఇటు గురుకులాలు నిర్వీర్యం అయిపోయి ప్రజలు ప్రైవేటు పాఠశాలలపై మొగ్గుచూపే పరిస్థితి నెలకొందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కొంతమంది అధికారులు పాఠశాల యజమాన్యాలతో మాట్లాడుకొని పుస్తకాలను అక్రమంగా అమ్ముకునేందుకు ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతున్నారని సమాచారం మాకు ఉందన్నారు.

తల్లిదండ్రులు పిల్లలను చదివించాలంటే వారి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో డీఈఓ తగిన ఆదేశాలు అధికారులకు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రైవేట్ పాఠశాలల గోదాములపై మీడియా ప్రతినిధులకు, పోలీస్‌లకు సమాచారం ఇచ్చి మరీ ముట్టడిస్తామని, శాంతియుతంగానే చర్యలు ఉంటాయన్నారు. ఒకవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నిజాలు బయటపెడుతామన్నారు.

ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్‌తో పాటు జిల్లా BRSV కో-ఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గంగాధర చందు, పటేల్ శ్రవణ్ రెడ్డి, సోమిరెడ్డి రాజా నరేష్ రెడ్డి, వడ్లకొండ పరుశరామ్, విక్రమ్, అన్వేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>