కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్ తగిలింది. ఈ జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా కౌంటింగ్ రోజున ఉదయ పది గంటల సమయానికి వెలువడిన ఫలితాల్లో గడ్డపోతారం మున్సిపాలిటీలో (Gaddapotharam Municipality) బీఆర్ఎస్ గెలిచినట్లు తేలింది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తానని జగ్గారెడ్డి చెప్పుకున్నా ఆ జిల్లా నుంచి వెలువడిన తొలి ఫలితం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పోలింగ్ రోజున సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో పోలీసు అధికారులతో జగ్గారెడ్డి ఘర్షణ పడ్డారు. విధి నిర్వహణలో ఉన్న పలువురు పోలీసులను పరుష పదజాలంతో దూషించారు. తీవ్ర స్థాయిలో హోమ్‌గార్డుల్ని హెచ్చరించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఘాటుగానే స్పందించి పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించడంపై నోటీసు జారీచేసింది. జిల్లాలో తిరుగులేదంటూ గొప్పగా చెప్పుకునే జగ్గారెడ్డికి గడ్డపోతారం (Gaddapotharam Municipality) ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ఆ మున్సిపాలిటీలోని మొత్తం 18 వార్డుల్లో 14 చోట్ల బీఆర్ఎస్ గెలవగా కాంగ్రెస్‌కు మూడు మాత్రమే దక్కాయి. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. విర్రవీగిన జగ్గారెడ్డికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారంటూ గడ్డపోతారం స్థానికుల్లో చర్చలు మొదలయ్యాయి.
Read Also: కౌంటింగ్ రోజు ఢిల్లీలోనే సీఎం.. గతంలోనూ ఇదే ట్రెడిషన్
Follow Us On: Sharechat


