తెలంగాణ మీ అయ్య జాగీరా?: సిపీ సజ్జనార్‌‌కు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుముంటున్నాయి. యువత ఎక్కువగా తమ అధినేత కేసీఆర్ పాటలతో నిమజ్జన ఊరేగింపుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేళ సజ్జనార్ ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పవిత్రమైన నిమజ్జన కార్యక్రమాల్లో ఏ పాటలు పెట్టుకోవాలో చెప్పడానికి, యువతను కేసుల పేరుతో భయపెట్టడానికి సజ్జనార్ ఎవరు అని కౌశిక్ రెడ్డి నిలదీశారు. ఈ క్రమంలోనే “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అంటూ సజ్జనార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము పోలీసులమని మరిచిపోయి కొందరు అధికారులు రాజకీయ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారని సజ్జనార్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రెండేళ్లలో రిటైర్ అయిపోతానని సజ్జనార్ అనుకుంటున్నారేమో, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలున్నా పట్టుకొస్తామని హెచ్చరించారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం కేవలం ఆరంభం మాత్రమేనని, ఆయనలాగే మిగతా 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు పడటం ఖాయమని, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని స్పష్టం చేశారు. అంతేకాదు దానం నాగేందర్ ఫిరాయింపుపై మొదటి నుంచీ పిటిషన్ వేసి అసలైన పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని, తీర్పు వచ్చే సమయానికి సందట్లో సడేమియా లాగా బీజేపీ వాళ్లు చివర్లో ఒక పిటిషన్ వేసి అంతా తామే సాధించామని డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, మిగతా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా పిటిషన్లు ఎందుకు వేయలేకపోయారని ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>