కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి బి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి 1000 రోజులు గడిచినా తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, వృద్ధులు వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్ల పెంపు, తదితర సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ పోరాటంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందనీ, ఇంకా చేస్తూనే ఉంటుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి రానున్న రోజుల్లో తగిన గుర్తింపు ఉంటుందని,వారం రోజుల పాటు నిర్వహించే నిరసన కార్యక్రమల్లో అందరూ సమిష్టిగా పాల్గొనాలని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్టం మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో వెనక్కి నెట్టి వేయబడిందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీగా మేము అడిగితే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతాయనీ, లేదంటే అమలు అవుతున్న పథకాలు కూడా ప్రభుత్వం నిలిపే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌లు ఆంజనేయులు, రహమాన్, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మాజీ జెడ్పీటీసీ నరేందర్, సింగిల్ విండో చైర్మన్‌లు రాజేశ్వర్ రెడ్డి, కృష్ణయ్య గౌడ్, హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మహబూబ్‌నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులూ, కార్పొరేటర్లు ఇతర నాయకులూ పాల్గొన్నారు.

