కవితకేమో సస్పెన్షన్.. రోహిత్ రెడ్డికి నోటీసులా? BRS వైఖరిపై రచ్చ!

కలం, వెబ్ డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు (Moinabad Drugs Case) అంశం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. డ్రగ్స్ తీసుకుంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్టుబడటం తీవ్రమైన చర్చనీయాంశం అవుతోంది. ఈ అంశంపై తొలుత స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో రోహిత్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి నోటీసులు పంపింది.

అయితే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారని అంతా భావించారు. కానీ కేవలం నోటీసులకే పరిమితం కావడం విమర్శలకు తావిచ్చింది. సొంత పార్టీ మీద ధిక్కార స్వరం వినిపించిందన్న చిన్న కారణంతో కవితను సస్పెండ్ చేసిన కేసీఆర్.. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కవిత సొంతపార్టీ మీద తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరిచారు. పార్టీలో జరుగుతున్న లోటుపాట్లను చెప్పారు. హరీశ్ రావు వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని వివరించారు. అలా చెప్పినందుకే కవితను అవమానకరంగా బయటకు పంపించిన గులాబీ బాస్.. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రోహిత్ రెడ్డి విషయంలో ఎందుకిలా చూసీ చూడనట్టు వ్యవరించారన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక కవితను బీఆర్ఎస్ పార్టీ కుట్ర పూరితంగా బయటకు పంపించారన్న ఆరోపణలూ ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదట్నుంచి కవిత విషయంలో అసహనంగా ఉన్నారని అందుకే సమయం చూసి ఆమెను గెంటేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. సొంత కూతురు పార్టీ మీద చిన్న విమర్శ చేస్తేనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్న కేసీఆర్.. డ్రగ్స్ ఆరోపణలను మాత్రం లైట్ తీసుకున్నారు.

రోహిత్ రెడ్డిపై అందుకేనా ఉదాసీనత

డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రోహిత్‌రెడ్డి‌ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడని చెబుతుంటారు. ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ బినామీగా రోహిత్ రెడ్డి ఉన్నాడని .. అతని వద్ద కేటీఆర్ చిట్టా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫామ్‌హౌస్ కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి వ్యసనపరుడనే కామెంట్స్ వచ్చినా.. అతను అణిముత్యం అంటూ కేసీఆర్ కితాబిచ్చారు. ఇప్పుడు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ప్రజాగ్రహాన్ని గుర్తించి కక్కలేక.. మింగలేక పైలట్ కు షోకాజ్ నోటీసులతో కేసీఆర్ సరిపెట్టారనే కథనాలు వెలువడుతున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసును సిట్ విచారిస్తోంది. ఈ కేసులో ఇంకా ఎటువంటి అంశాలు బయటకువస్తాయో.. ఈ డ్రగ్స్ వాడకం వెనుక ఎంత పెద్ద ముఠా దాగి ఉందో అన్నది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>