కలం, ఖమ్మం బ్యూరో : గ్రామాల అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకం అని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యా చందన తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె ములకలపల్లి మండలాన్ని సందర్శించారు. జగన్నాధపురం గ్రామంలో పలు అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలు, మహిళల ఆర్ధిక సాధికారత వంటి అంశాలపై దృష్టి సారిస్తూ 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, వర్షపు నీటి నిల్వలను నివారించడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం 99 రోజుల కార్యక్రమం అత్యంత కీలకమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జగన్నాధపురం గ్రామపంచాయతీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంఘాల ఆర్థిక పరిస్థితులను సమీక్షించి, రుణాల సక్రమ వినియోగం, ఆదాయ వృద్ధి మార్గాలు, ప్రభుత్వ పథకాల సమర్థ వినియోగంపై సభ్యులకు మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

