Mobile Popup Ad
Mobile Popup Ad

బ్రెజిల్‌లో ఘోరం: తాడు కట్టడం మరిచారు.. ప్రాణాలు తీశారు!

కలం, వెబ్ డెస్క్ : బ్రెజిల్‌ (Brazil) లోని సావో పాలో రాష్ట్రంలో ఉన్న లిమేరా నగరంలో ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. ఇక్కడ ఉన్న ప్రసిద్ధ “స్కెలిటన్ బ్రిడ్జ్” పై రోప్ జంపింగ్ (Brazil Rope Jump) క్రీడను నిర్వహించే “ఎంత్రే కోర్దాస్” (Entre Cordas) సంస్థ సిబ్బంది చేసిన ఘోర తప్పిదం వల్ల 21 ఏళ్ల మరియా ఎదువార్దా రోడ్రిగ్స్ అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా ఇలాంటి సాహస క్రీడల్లో పాల్గొనే వారికి కచ్చితమైన రక్షణ ఏర్పాట్లు చేయాలి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సదరు సంస్థకు చెందిన ఇన్‌స్ట్రక్టర్లు యువతికి రక్షణ తాడును (Safety Rope) పూర్తిగా అమర్చడం మరిచిపోయారు. కనీసం తాడు సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోకుండా, ఆమెను ప్లాట్‌ఫారమ్ నుంచి నేరుగా కిందకు నెట్టేశారు. సుమారు 30 నుంచి 40 మీటర్ల ఎత్తు గల బ్రిడ్జ్ పైనుంచి ఆమెను పడేసిన మరుక్షణమే, అక్కడ ఉన్న వారు “తాడు ఎక్కడ?” అంటూ కేకలు వేశారు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. రక్షణ తాడు లేకపోవడంతో ఆ యువతి నేరుగా కింద పడిపోయింది.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు (SAMU) ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే సదరు సంస్థకు చెందిన ఇద్దరు నిందితులు సమీపంలోని అడవుల్లోకి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వారిని పట్టుకున్నారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాహస క్రీడల నిర్వహణలో భద్రతా ప్రమాణాలను విస్మరించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>