నీటి వృథా అరికట్టాలి: కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

కలం, హనుమకొండ: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ (Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి సరిపడా మంచినీరు సరఫరా అయ్యేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

సోమవారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో ఎల్‌నినో ప్రభావ పరిస్థితులపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. చెరువులు, నీటి వనరుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల వివరాలను ఇరిగేషన్‌ అధికారులు వివరించారు. నీటి వృథాను అరికట్టేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు.

లీకేజీలను వెంటనే గుర్తించి..

నీటి సరఫరా సమయంలో పైప్‌లైన్లలో లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. పైప్‌లైన్లు, కార్‌ వాషింగ్‌ సర్వీసులు తదితర ప్రాంతాల్లో నీటి వృథా జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ప్రతి నెలా సమీక్ష నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

అనంతరం ఎంపీడీవోలతో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీబీ-జీ రామ్‌ జీ పథకంలో అర్హులైన గ్రామీణ జాబ్‌కార్డు దారులకు ఉపాధి కల్పించాలని, కూలీలు అధిక సంఖ్యలో పనులకు హాజరయ్యేలా పర్యవేక్షించి పనుల టర్నోవర్‌ పెంచాలని సూచించారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ టి.వెంకన్న, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌ శేషాద్రి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>