కలం, కరీంనగర్ : పువ్వులను పూజించే తెలంగాణలో.. మట్టిని కూడా పూజించే పండుగ పేరే బొడ్డెమ్మ. బొడ్డెమ్మ (Boddemma Festival) గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ, తెలంగాణ పల్లె ప్రజల నమ్మకం ప్రకారం ఎండాకాలం పూర్తయి, వర్షాకాలంలో వర్షాలతో చెరువులు నిండి, పువ్వులు పూస్తూ, పంటల పచ్చదనం పుట్టే సమయాన్ని సృష్టికి తొలిదశగా భావించి బొడ్డెమ్మను పూజించే సంప్రదాయం కొనసాగుతోంది.
భాద్రపద పౌర్ణమి తర్వాత ఆరో లేదా ఏడో రోజు నుంచి బొడ్డెమ్మ ఆటను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కట్టరాంపూర్లో బొడ్డెమ్మ వేడుకలను (Boddemma Festival) ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు బొడ్డెమ్మ చుట్టూ చేరి సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సందడి చేశారు. పాటలకు తగ్గట్టుగా అడుగులు వేస్తూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. బొడ్డెమ్మ పాటలతో కట్టరాంపూర్లో పండుగ వాతావరణం నెలకొనగా, పలువురు మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

