ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ నియామకం శుభపరిణామం: మహేష్ కుమార్ గౌడ్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్ (BM Sandeep) అధ్యక్షతన గాంధీ భవన్‌లో ఆదివారం పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ), అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌కు విచ్చేసిన సందీప్ కుమార్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించగా, అనంతరం జరిగిన ఈ కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన మీనాక్షి నటరాజన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, యువజన కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన అపార అనుభవం సందీప్ కుమార్‌కు ఉందని ఆయన కొనియాడారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనకు అధిష్ఠానం తెలంగాణలో పార్టీ, ప్రభుత్వ సమన్వయ బాధ్యతలను అప్పగించడం శుభపరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లోనూ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేశవ్యాప్తంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అగ్రనేత రాహుల్ గాంధీ సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ( SIR) వంటి అంశాలపై తెలంగాణలోనూ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల 26న హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నెహ్రూ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>