కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా.. పటాన్‌చెరు నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి (Godavari Anjireddy) విమర్శించారు. ఒక్క అభివృద్ధి పనైనా జరగలేదని విమర్శించారు. నియోజకవర్గంలోని శివనగర్ నుంచి పెద్ద కంజర్ల వరకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన నిరసన దీక్షలో గోదావరి అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
రోడ్లు బాగాలేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు నరకయాతన చెందుతున్నా.. ప్రభుత్వాలకు పట్టడం లేదని గోదావరి అంజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే శివనగర్ – పెద్ద కంజర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిన్నారం మున్సిపాలిటీ అధ్యక్షులు జగన్ రెడ్డి, జిన్నారం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

