కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూర్ జిల్లాలోని పలు మండలాల్లో సుమారు దశాబ్దాల క్రితం ప్రభుత్వం పేద రైతులకు (Nizamabad Farmers) పట్టాలు ఇచ్చిన అసైన్డ్ భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ ఖండించారు. ఈ మేరకు కలెక్టరేట్ లో ప్రజావాణిలో ఆయన రైతులతో కలిసి వినతిపత్రం అందించారు. 1986లో (దాదాపు 40 ఏళ్ల క్రితం) ప్రభుత్వమే పేద రైతులకు అసైన్డ్ భూములపై పట్టాలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు రైతులు, వారి కుటుంబాలు ఆ భూములను చదును చేసుకుని, వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.
ఇదే పట్టాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుండి రుణాలు పొందడమే కాకుండా, గత 13 సంవత్సరాలుగా ప్రభుత్వం అందిస్తున్న ‘రైతు బంధు’ / ‘రైతు భరోసా’ పథకం కింద ఆర్థిక సహాయం కూడా పొందుతున్నారని చెప్పారు. ఇన్నేళ్లుగా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసుకుని, సాగు చేసుకుంటున్న భూములను ఇప్పుడు అటవీ శాఖ అధికారులు తమవి అని పేర్కొంటూ రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. భూములను ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ పెత్తనం చెలాయించడం అత్యంత బాధాకరం అని ఖండించారు.
జిల్లాలోని ధర్పల్లి మండలం (రామడుగు గ్రామం), ఇందల్వాయి మండలం (సిర్నాపల్లి, నల్లవెల్లి గ్రామాలు), అలాగే సిరికొండ, మోపాల్, వర్ని మండలాలలోని పలు గ్రామాలలో ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. 2004వ సంవత్సరానికి ముందు నుండి అటవీ భూములలో సాగు చేసుకుంటున్న గిరిజన, పేద రైతులకే తెలంగాణ ప్రభుత్వం ‘పోడు పట్టాలు’ ఇచ్చి ఆదుకుందని… అలాంటిది, 1986లోనే ప్రభుత్వమే అధికారికంగా పట్టాలు ఇచ్చిన అసైన్డ్ భూములను ఇప్పుడు లాక్కోవాలని చూడటం ఏమాత్రం సమంజసం కాదని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న వారందరికీ తక్షణమే పోడు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అటవీ శాఖల మధ్య ఉన్న వివాదాల కారణంగా అమాయక పేద రైతులు బలవుతున్నారని చెప్పారు. అటవీ అధికారులు తమ అసలు అటవీ భూములను రక్షించుకోవాల్సింది పోయి, దశాబ్దాలుగా రైతుల ఆధీనంలో ఉన్న పట్టా భూములపై నోటీసులు ఇవ్వడం తగదని అన్నారు. రైతులకు ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేసి పేద రైతులను ఆదుకోవాలని విన్నవించారు.

