కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై పాలమాకుల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Shamshabad Accident) చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం పూర్తి చేసుకుని మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం మెట్టుగడ్డ తండా (చౌడూరు)కి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఇన్నోవా కారులో శంషాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కేతవత్ లింబ్యా, జమున, కత్రోవత్ మానసింగ్, కేతవత్ వాస్రామ్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. కారును నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్ తీవ్రంగా గాయపడటంతో, శంషాబాద్‌లోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

