కలం, నిజామాబాద్ బ్యూరో : ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో దుబాయ్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు (Dubai Bathukamma Celebrations) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి. ఈ వేడుకలకు తెలంగాణ నుంచి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త(Bigala Ganesh Gupta) ను ETCA ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకలకు వేలాదిగా తరలివచ్చిన తెలంగాణ మహిళలు, సోదర సోదరీమణులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంప్రదాయ పాటలతో పాటు “జై తెలంగాణ.. జై కేసీఆర్.. కారే రావాలి సారే రావాలి మళ్లీ” అంటూ నినాదాలు, పాటలతో వేడుకల ప్రాంగణం మార్మోగింది. దుబాయ్‌లో జరుగుతున్న ఈ సంబరాలను చూస్తుంటే తెలంగాణలోనే ఉన్నామా అన్న అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.
విదేశీ గడ్డపై ఉంటూ కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వాటిని పరిచయం చేస్తున్న ETCA ప్రతినిధులను, బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ ఆడపడుచులను, సోదర సోదరీమణులను బిగాల గణేశ్ గుప్త అభినందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ ,ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు.

