కలం, వలిగొండ : రైతుల సంక్షేమం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నూతన పాలకవర్గం పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam) సూచించారు. బుధవారం వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో నిర్వహించిన పీఏసీఎస్ నూతన పాలకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే (MLA Kumbam) శుభాకాంక్షలు తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్‌గా గరిసె రవికి మండల ప్రజలు గొప్ప బాధ్యత అప్పగించారని, ప్రజలు, రైతులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పదవికి గౌరవం తీసుకురావాలని సూచించారు. రైతులకు అందించే సేవలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సహకార సంఘం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
వలిగొండ మండల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తోందని పేర్కొన్నారు.
భువనగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానిక శాసనసభ్యుడిగా వలిగొండ మండల అభివృద్ధే తన తొలి ప్రాధాన్యమని కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్య, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడేలా పాలన అందిస్తామని, కార్యకర్తల బలమే తమ బలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పీఏసీఎస్ చైర్మన్ గరిసె రవి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని, రైతులకు పారదర్శక సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమానాయక్, వలిగొండ గ్రామ సర్పంచ్ కుంభం వెంకటపాపిరెడ్డి, ఉపసర్పంచ్ మల్గ మాధవి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహాదేవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ జడ్పీటీసీ పద్మ అనంతరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, సహకార సంఘ సభ్యులు, అధికారులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Read Also: తుంగతుర్తి ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్
Follow Us On : WhatsApp

