పర్యాటక కేంద్రంగా ‘పులిగుండాల’

కలం, ఖమ్మం బ్యూరో: పులిగుండాల ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక క్షేత్రంగా అభివృద్ది చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)  పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం బ్రాహ్మళ్లకుంట గ్రామంలోని  పులిగుండాల ప్రాజెక్ట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్బంగా  బోటింగ్, వాటర్ ఫాల్స్, జంగిల్ సఫారీ‌లను భట్టి, పొంగులేటి ప్రారంభించారు. ఈ అందమైన ప్రదేశాన్ని పరిచయం చేసిన ఎమ్మెల్యే డీఎఫ్‌వోలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు భట్టి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని చెప్పారు. తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని భట్టి పేర్కొన్నారు.

కనకగిరి హిల్స్ అభివృద్ధి చేయండి

కనకగిరి హిల్స్ అభివృద్ధిని తక్షణమే చేపట్టాలని అధికారులను భట్టి (Bhatti Vikramarka) ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా కాటేజీల నిర్మాణానికి రూ.4 కోట్లు సీఎస్ఆర్ నిధుల నుండి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పనుల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి, పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎప్పుడు పూర్తవుతాయి? అన్నది తేదీలవారీగా డిస్ ప్లే చేయలని సూచించారు. పర్యాటకులు ఈ ప్రాంతానికి సులభంగా చేరుకునే విధంగా డబుల్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని ఆదేశించారు.

కనకగిరిహిల్స్ అందమైన ప్రాంతం: పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. కనకగిరి హిల్స్ వంటి అందమైన ప్రాంతాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎకో టూరిజం క్రింద రాష్ట్రంలో టాప్ 3 గమ్యస్థానాలలో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన పూర్తి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని, అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించి మిగిలిపోయిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను ప్రస్తుత ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు ఆ ప్రాజెక్ట్ నుండి ఈ ప్రాంతానికి నీటిని తీసుకువచ్చి నిరంతర నీటి సరఫరా కల్పించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, చెట్లు లేకుండా జీవనం సాధ్యం కాదని, మనిషి జీవితం చెట్లపై ఆధారపడి ఉందని తెలిపారు. కనకగిరి హిల్స్‌కు ఎకో టూరిజం కింద నిధులు, నీలాద్రి హిల్స్‌కు దేవాలయ పర్యాటక అభివృద్ధి క్రింద నిధులను డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, అటవీ శాఖ అధికారులు సువర్ణ,భీమా నాయక్, సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>