కలం, ఖమ్మం బ్యూరో: సరిగ్గా ఉదయం 5.30 నుంచి 6 గంటల సమయంలో చీకటి తెరలను చీల్చుకుంటూ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చి ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి రాత్రంతా వచ్చే ఈ రైలు ప్రయాణికులతో కళకళలాడుతుంటుంది. కానీ, ఆ సందడి సద్దుమణిగిన మరుక్షణమే.. అక్కడ నిశ్శబ్దం ఆవహిస్తుంది. వందలాది మందిని మోసుకొచ్చిన ఆ పొడవైన రైలు భోగీలు ఒక్కసారిగా ఆగిపోతాయి. తిరిగి రాత్రి 9:45 గంటల వరకు.. అంటే దాదాపు 14 గంటల పాటు పట్టాలపై పడి ఉంటుంది.
అదే సమయంలో బయట పూర్తి భిన్నమైన ప్రపంచం కనిపిస్తుంది. పినపాక, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు ఉదయాన్నే రాజధాని హైదరాబాద్ వైపు ప్రయాణమయ్యేందుకు బస్టాండ్ల వైపు పరుగెడుతుంటారు. అత్యవసర వైద్యం, ఉన్నత చదువులు, పనులపై వెళ్లే సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు.. ఇలా రోజూ వేలాది మంది రోడ్డుపైకి వస్తారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో జేబులు గుల్ల చేసుకుంటూ, అగ్గిపెట్టెల్లాంటి వాహనాల్లో నలిగిపోతూ ప్రయాణం సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సు ఛార్జీతో పోలిస్తే రైలు టికెట్ ధర మూడొంతులు తక్కువ కావడంతో, కనీసం కూర్చోవడానికి సీటు దొరక్కపోయినా సరే.. ట్రైన్లో ప్రయాణించడానికి ఏజెన్సీ ప్రజలు సిద్ధపడుతుంటారు.
కళ్లముందున్న కదలవు
కళ్లముందే 14 గంటలకుపైగా ఖాళీగా పడి ఉండే ఆ బోగీలను వాడుకుని, ఉదయాన్నే మణుగూరు నుంచి చర్లపల్లి టెర్మినల్‌కు ‘ఇంటర్సిటీ’ రైలు నడిపితే ఏజెన్సీ ప్రజల సమయం, సొమ్ము ఆదా అవుతాయి. ఉదయం 6:45 గంటల సమయంలో మణుగూరులో బయలుదేరేలా ఈ రైలును సమాయత్తం చేస్తే, మధ్యాహ్నం 12 గంటలకల్లా హైదరాబాద్‌లోని నూతన చర్లపల్లి టెర్మినల్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 3:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి రాత్రి 9 గంటలకు మణుగూరు చేరుకుంటే, అదే రైలును రాత్రి 9:45 గంటలకు యథావిధిగా సికింద్రాబాద్ నైట్ ఎక్స్‌ప్రెస్‌గా మళ్లించవచ్చు. దీనివల్ల రైల్వే శాఖకు అదనంగా ఒక్క బోగీ గానీ, కొత్త ఇంజిన్ గానీ కేటాయించాల్సిన అవసరం ఉండదు. కేవలం ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకుంటే నాలుగు నియోజకవర్గాల ప్రజల రవాణా కష్టాలు తీరుతాయి. కానీ ఆచరణలో ఆ ఆశ నెరవేరక, బోగీలు పట్టాలపై నిశ్శబ్దంగా నిద్రపోతూనే ఉన్నాయి.
పట్టాలెక్కని నిరుపేదల బండి
మరోవైపు కోవిడ్ మహమ్మారి ముగిసి దేశమంతటా రైళ్లు మళ్లీ కూతలు వేస్తూ పరుగులు తీస్తున్నా ఇక్కడ నిలిచిపోయిన ‘కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్’, నిరుపేదల బండిగా పేరొందిన ‘కాకతీయ ప్యాసింజర్’ రైళ్లు మాత్రం పునఃప్రారంభం కాకపోవడం ఈ ప్రాంతపు చిన్న వ్యాపారులను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రజలు, ప్రజాసంఘాలు అధికారుల చుట్టూ తిరిగితే.. ప్యాసింజర్ స్థానంలో వేగవంతమైన రైలు వేస్తామని చెప్పారు. కానీ ఏళ్లు గడుస్తున్నా, ఆ రైలు బోగీల కేటాయింపు నివేదికలు, ఫైళ్ల తిరోగమనాల నడుమ నలిగిపోయిందే తప్ప నేటికీ పట్టాలెక్కలేదు.
త్వరలోనే రాబోతున్న గోదావరి పుష్కరాల నేపధ్యంలో భద్రాచలం రాముల వారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు కూడా ఈ రైలు మార్గమే ప్రధాన ఆధారం కానుంది. పుష్కరాల నాటికైనా రైలు సర్వీసులను పునరుద్ధరించి, పెంచితే భక్తులకు రవాణా సౌకర్యం కలగడమే కాకుండా రైల్వే శాఖకు ఆర్థికంగా భారీ లాభం చేకూరుతుంది.
పాలకులకు పట్టడం లేదు: రాజేశ్వర్ రావు, మణుగూరు
”ట్రైన్ ఉంది.. టైమ్ ఉంది.. పాలకులకే మనసు లేదు” అన్నట్టుగా మారిన ఈ పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్షణమే స్పందించాలి. మణుగూరు స్టేషన్లో 14 గంటల ట్రాక్‌కే పరిమితమైన రైలును పట్టాలెక్కించి మా ప్రాంత వాసుల ప్రయాణ కష్టాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.
Also Read : టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు ముహూర్తం ఫిక్స్ !
Follow Us On: Instagram

