కలం, కరీంనగర్ బ్యూరో: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం (BC Welfare) ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల ఉమా మహేశ్వర్, మహిళ విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గున్నాల కన్నంబా, బీసీ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొని శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి నరాల శ్రీకాంత్, బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

