కలం, వెబ్ డెస్క్: ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ కూతురిని వేధిస్తున్నాడనే అనుమానంతో బాలిక కుటుంబ సభ్యులు చేసిన దాడిలో పదో తరగతి పూర్తిచేసిన ఒక మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి (Vemagiri) గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేమగిరి గ్రామానికి చెందిన ఓ బాలుడు టెన్త్ పూర్తిచేశాడు. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బాలుడే ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు.
ఆ బాలుడు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తుండగా, తన కూతురిని వేధిస్తున్నాడని బాలిక తండ్రి నరేంద్ర అనుమానించాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ తండ్రి నిజానిజాలు తెలుసుకోకుండా తన బంధువులు నాగేశ్వరరావు, అర్జునరావుతో కలిసి బాలుడిపై దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి తల్లి ఇచ్చని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

