కలం, సిరిసిల్ల : గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం(15th Finance Commission) నిధులను జీతభత్యాలు, కరెంట్ బిల్లుల కోసం మళ్లించడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. నిధుల దారి మళ్లింపును సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాస్తామని, అవసరమైతే కేంద్ర నిధులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలలో జమ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సిరిసిల్ల (Sircilla) జిల్లా పర్యటనలో భాగంగా బండి సంజయ్ కుమార్ పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేశ్ బి. గీతే తదితర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అమృత్-2 పథకం కింద రూ.105 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కార్గిల్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్గిల్ యుద్ధ శకటాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమృత్-2 పథకం కింద కార్గిల్ చెరువు అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను కోరినట్లు చెప్పారు. పనులలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రం అమృత్ పథకం ద్వారా పట్టణాలలో మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తోందని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో అమృత్-1 కింద రూ.1,660 కోట్లు, అమృత్-2 కింద రూ.3,429 కోట్లను కేంద్రం కేటాయించిందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు మున్సిపాలిటీలకు సుమారు రూ.400 కోట్ల నిధులు కేటాయించగా, సిరిసిల్ల మున్సిపాలిటీకి రూ.105 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కేంద్ర నిధులే ప్రధాన కారణమని ఆయన అన్నారు. కేంద్రం గత 12 ఏళ్లలో తెలంగాణకు రూ.13 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శించడం అవాస్తవమని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల అభివృద్ధి కోసమే వినియోగించాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. వాటిని విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాల కోసం ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. సర్పంచులపై ఒత్తిడి తెచ్చి నిధులను మళ్లించడం సరికాదని పేర్కొన్నారు. నిధుల వినియోగంలో మార్పు రాకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు.

