కలం, వెబ్ డెస్క్: ఏపీలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలల్లో జనసేన పార్టీ పోటీపై ఆ పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తెనాలిలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Elections) జనసేన పార్టీ బలాబలాలను బట్టి పోటీ చేస్తోందని తెలిపారు. అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గేందుకూ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. కూటమి బలోపేతమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొత్తు నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే స్థానిక ఎన్నికల్లోనూ అదే ఫార్ములా ఉంటుందనుకోవడం సరికాదని తేల్చిచెప్పారు. జనసేన పార్టీలో కష్టపడి పనిచేసే వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని భరోసా కల్పించారు.

