గంజాయిపై ఖమ్మం పోలీసుల సర్జికల్ స్ట్రైక్

కలం, ఖమ్మం బ్యూరో : పొరుగు రాష్ట్రాల నుంచి ఖమ్మం జిల్లా మీదుగా సాగుతున్న గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఖమ్మం పోలీసులు (Khammam Police) ఉక్కుపాదం మోపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ‘సర్జికల్ స్ట్రైక్’ (Surgical Strike) ప్రకటించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను క్షణాల్లో గుర్తించే నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ (స్నిఫర్ డాగ్స్) ను రంగంలోకి దించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను నిలిపివేసి నార్కోటిక్ జాగిలాల సహాయంతో ప్రయాణికుల బ్యాగులు, పార్శిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో సీఐ ఉదయ్ కుమార్, ఎస్ఐ  కిరణ్‌తో పాటు పోలీసు సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్లు, అనుమానాస్పద ప్రాంతాలలో  ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నార్కోటిక్ జాగిలాల సహాయంతో పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాలలో కూడా నిఘా పెంచినట్లు వెల్లడించారు.

మాదకద్రవ్యాల విక్రయదారులను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. యువత భవిష్యత్తును మత్తు పదార్థాలు నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో డ్రగ్స్ లేదా గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>