కలం, ఖమ్మం బ్యూరో: ఫ్యామిలీ ట్రిప్ ముసుగులో భార్యాభర్తలు గంజాయిని సప్లయ్ చేస్తున్నారు. నిఘా పెట్టిన అశ్వాపురం (Aswapuram) పోలీసులు బుధవారం రంగంలోకి దిగి గుట్టు రట్టు చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో రవాణా చేస్తున్న 40 కిలోల 560 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దంపతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన ఈ గంజాయి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కారులో షిర్డీకి గంజాయి తరలిపోతోందనే సమాచారం అశ్వాపురం ఎస్‌ఐ రాజేశ్‌కు అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి గొల్లగూడెం సీతారాం కెనాల్ బ్రిడ్జి వద్ద నిఘా పెట్టి, వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కారును క్షుణ్ణంగా సోదా చేయగా, డిక్కీలో 40.560 కిలోల గంజాయి బయటపడింది.
ఒడిశా, మల్కన్‌గిరి జిల్లా కలిమెలకు చెందిన అరబిందో బిశ్వాస్ (33), ఆయన భార్య సుప్రియ బిశ్వాస్ (26)ను నిందితులుగా పోలీసులు గుర్తించారు. గంజాయి సరఫరా నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు.

