కలం, బాసర: జాతీయ స్థాయి ఎలక్ట్రిక్ రేసింగ్ (Electric Bike Racing) పోటీల్లో బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (Basara RGUKT) విద్యార్థులు సత్తా చాటారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఎఫ్‌ఎంఏఈ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో విశ్వవిద్యాలయానికి చెందిన ‘టీమ్ వేగా’ ఏడో ర్యాంకు సాధించి ప్రశంసలు అందుకుంది. విశ్వవిద్యాలయంలోని ఈఈఈ విభాగానికి చెందిన విద్యార్థులు స్వయంగా ఎలక్ట్రిక్ రేసింగ్ బైక్‌ను రూపొందించి, తయారు చేసి పోటీల్లో పాల్గొన్నారు. పరిమిత ఆర్థిక వనరులు, అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం విశేషమని ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం చేసిన ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ భావ్ సింగ్, అధ్యాపకులు డాక్టర్ ఎన్. రాకేశ్, వి. వినయ్ కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

