కలం , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం (Dacharam) గ్రామంలో వివిధ రంగాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న విశిష్ట వ్యక్తులను ఘనంగా సత్కరించారు. విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ అభినందన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి అంకితభావంతో సేవలు అందిస్తున్న వారిని శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ప్రజారోగ్య పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న ఆశా కార్యకర్తలు కట్కూరి కస్తూరి, గజ్జెల అరుణ లను ఘనంగా సత్కరించారు. దాదాపు 40 సంవత్సరాలకు పైగా పారిశుద్ధ్య కార్మికుడిగా అవిశ్రాంతంగా సేవలందించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న బంటు పోచయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
సమాజానికి సేవామూర్తులే ఆదర్శం
ఈ సందర్భంగా మారవేణి చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పదవులు, హోదాలతో సంబంధం లేకుండా నిస్వార్థంగా శ్రమించే వ్యక్తులే సమాజానికి నిజమైన ఆదర్శమని కొనియాడారు. సేవామూర్తులను సత్కరించడం మన బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. గ్రామానికి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి కుడుముల రేణుక నాగరాజు, ఉప సర్పంచ్ శ్రీమతి కొడిముంజ అనిత విక్రం, గ్రామ ప్రముఖులు బోలవేణి రాజు, కట్కూరి తిరుపతి, చిలకపెళ్లి బాలయ్య, బంటు విజయ్, మంద సురేష్ తదితరులు పాల్గొన్నారు.

