కలం, కరీంనగర్ బ్యూరో : వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ – రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అరైవ్ అలైవ్ లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. గత ఏడాది రాష్ట్రంలో హత్యల వల్ల 800 మంది ప్రాణాలు కోల్పోగా, రోడ్డు ప్రమాదాల వల్ల ఏకంగా 7500 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. మొదటిసారిగా పోలీస్ శాఖ కార్యక్రమాన్ని ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాలిక’ లో చేర్చినట్లు చెప్పారు.
హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయనేది కేవలం అపోహే..
జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 70 శాతం మరణాలు ద్విచక్ర వాహనదారులవే ఉంటున్నాయన్నారు. బైక్ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా నాణ్యమైన హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయనేది కేవలం అపోహ మాత్రమేనని, తనకు జుట్టు ఊడిపోవడానికి హెల్మెట్‌కు సంబంధం లేదని తన వ్యక్తిగత ఉదాహరణతో వివరిస్తూ డీజీపీ (DGP Shivadhar Reddy) నవ్వులు పూయించారు. హెల్మెట్ ధరించడం అనేది ప్యాంటుకు బెల్టు పెట్టుకున్నంత సహజంగా అలవరచుకోవాలని కోరారు. ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణించే అందరూ సీట్ బెల్ట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయని ఉదాహరణలతో వివరించారు.
వాహనదారులు ఎల్లప్పుడూ పరిసరాలను గమనిస్తూ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ చేయాలని, ముఖ్యంగా స్కూళ్లు, గ్రామాల జంక్షన్ల వద్ద వేగాన్ని తగ్గించాలని సూచించారు. పాదాచారులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, వారు ఎల్లప్పుడూ వాహనాలు వచ్చే ఎదురు దిశలో నడవాలన్నారు. చివరగా, మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ వచ్చిన తర్వాతే పిల్లలకు వాహనాలు ఇవ్వాలని, విద్యార్థులు కూడా బైకుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని కోరారు. ‘అరైవ్ అలైవ్’ సందేశాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లి రోడ్డు ప్రమాద రహిత తెలంగాణను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరైవ్ – అలైవ్ కి సంబందించిన స్కై బెలూన్ డీజీపీ ఆవిష్కరించారు. అదేవిధంగా పోస్టర్ మరియు అరైవ్ – అలైవ్ పాట సీడీని ఆవిష్కరించారు. హెల్మెట్ పంపిణి చేసారు. కరీంనగర్ పోలీసుల తరుపున ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేసారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా విజయ వంతంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు అశ్విని, డిఎంహెచ్ ఓ వెంకటరమణ , ఎంవిఐ చక్రవర్తి , ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు ఇతర అధికారులు, విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.

