కలం, ఖమ్మం బ్యూరో: ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో సాయం చేసిన వారికి ప్రభుత్వం రహ-వీర్ పథకం ద్వారా రూ.25 వేలు సహాయం అందిస్తుందని ఖమ్మం (Khammam) జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ ప్రసాదరావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. పీఎం రాహత్ పథకం కింద ప్రమాద బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్సను పూర్తిగా ఉచితంగా అందిస్తామని వివరించారు.
సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం మన రక్షణ కోసమేనని, వాటిని తప్పించుకోవాలని ప్రయత్నించడం సరికాదని సూచించారు. కారులో ప్రయాణించే సమయంలో డ్రైవర్ మాత్రమే కాకుండా ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఖమ్మం జిల్లాలో టాప్ 30 యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిదిద్దినట్లు తెలిపారు. దీని వల్ల ప్రమాదాలు తగ్గి ఈ ఏడాది 15 శాతం ప్రాణనష్టం తగ్గిందన్నారు. మరిన్ని బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌ను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగించి వాహనాలను గుర్తించి భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. తరచుగా నిబంధనలు ఉల్లంఘించే వారి లైసెన్సులు రద్దు చేసి వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా రోడ్డు భద్రతలో అగ్రగామిగా నిలవాలని, ప్రమాదాలు జరగకుండా అందరూ కృషి చేయాలని సూచించారు.
అనంతరం నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమని చెప్పారు. హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలను చూస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి తమను తాము రక్షించుకోవాలని, ఒకరి ప్రాణ నష్టం కుటుంబానికి, తమకు ఎంతో పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని వివరించారు.
లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ ప్రసాదరావు మాట్లాడుతూ.. అరైవ్ అలైవ్ అంటే ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోవడం అని భావించాలన్నారు. వాహనదారులు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు యూనిఫారం ధరించడం తప్పనిసరి అని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అవగాహన కార్యక్రమం అనంతరం కఠినంగా నిబంధనలు అమలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్టీఓ జె.ఎన్. శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

