బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షాలు!

కలం, వెబ్ డెస్క్ : ‘అర్నబ్’ తుఫాన్‌ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్ (AP Weather)ను మరో ముప్పు వెంటాడుతోంది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో తీవ్రమై వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

దీని ప్రభావంతో ఈ నెలాఖరు నుంచి నవంబర్ 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఇప్పటికే ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసి, పంటలు నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు ప్రజాజీవనం స్తంభించిన పరిస్థితుల్లో, మళ్లీ వాయుగుండం ముప్పు పొంచి ఉండటం తీరప్రాంత ప్రజలను, రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

వాతావరణ శాఖ తాజా ప్రకటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ, అలాగే జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, తీరప్రాంత ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>