కలం, వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు (AP Municipal Elections) సంబంధించి ఏకగ్రీవమైన చైర్పర్సన్, చైర్మన్ స్థానాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో 17చోట్ల ఏకగ్రీవం అయినట్లు స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలో 15 మున్సిపాలిటీలు ఏకగ్రీవమవగా.. జనసేన, బీజేపీకి ఒక్కోస్థానంలో ఏకగ్రీవం అయింది.
రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా వార్డుల్లో కూటమి పార్టీలకు చెందిన 726 మంది అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. టీడీపీకి 660, జనసేన పార్టీకి 38, బీజేపీకి 28 వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక వైసీపీ పార్టీ 19 స్థానాల్లో, సీపీఐ ఒక్క స్థానం, ఇండిపెండెంట్లు ఐదుగురి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉమ్మడి కడప జిల్లాలో 8 మున్సిపాలిటీల్లో ఆరుచోట్ల కూటమి అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వార్డుల్లో 21.08 శాతం, డివిజన్లలో 12.58 శాతం ఏకగ్రీవాలు నమోదయ్యాయి.

