కలం, వెబ్ డెస్క్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని వరి పొలాల మధ్యలో వెళ్తున్న ఓఎన్జీసీ (ONGC Gas Leak) పైపులైన్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీకైంది. కొద్దిసేపటికే పరిసర ప్రాంతాలన్నిటికీ గ్యాస్ వాసన తీవ్రంగా విస్తరించడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు సమీప ప్రాంతం నుంచి పరుగులు తీశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోయిన గ్రామస్థులు, వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, ఓఎన్జీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సాంకేతిక నిపుణులు గ్యాస్ లీక్‌ను అదుపులోకి తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజల భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా కలెక్టర్ తో పాటు అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పునరుద్ధరణ చర్యలు ముమ్మరం చేయడంతో పాటు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. గ్యాస్ లీకేజీ అదుపులోనే ఉందని.. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

