కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే.. మరోవైపు పలు జిల్లాల్లో ఆదివారం ( మే 31) పిడుగులతో కూడిన వర్షాలు ( AP Lightning Alert) కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. ఈ మేరకు అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య,చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఆకస్మికంగా చెదురుమదురు వర్షాలు పడతాయని పేర్కొంది.
పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్ర ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు, రైతులు, పశుకాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అయితే రాష్ట్రంలో ఎండలు స్వల్పంగా తగ్గి కొన్నిచోట్ల 42°-44°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని.. ఆయా మండలాల ప్రజలు మధ్యాహ్నం వేళ వీలైనంత వరకు బయటకు రావొద్దని సూచించింది.

