కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్వహించిన పబ్లిక్ పరీక్షల ఫలితాల (AP Inter Results)ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. గత 12 ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి మొదటి ఏడాదిలో 54 శాతం మంది ఉత్తీర్ణులై గత పుష్కర కాలంలోనే అత్యుత్తమ ఫలితాలను సాధించగా, రెండో ఏడాదిలో 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు. వీటితో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. 9552300009 అనే మన మిత్ర వాట్సాప్ నంబర్‌కు ‘Hi’ అని సందేశం పంపడం ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పొందవచ్చు. విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థుల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని మంత్రి లోకేష్ అభినందించారు.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు అధైర్యపడొద్దని, దీనిని ఒక గుణపాఠంగా తీసుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన సమయంలో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని అందిస్తూ అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో విద్యార్థులందరూ మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

