కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ (AP Gram Panchayat Elections) నేడు ఉదయం 7 గంటలకుప్రారంభమైంది. విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన 26 జిల్లాల పరిధిలో ఉన్న 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి దశలో ఏకగ్రీవాలు మినహాయించి సుమారు 3,189 సర్పంచ్ స్థానాలు, 25 వేలకు పైగా వార్డు సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుండగా, క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లకు నిబంధనల ప్రకారం సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా దాదాపు 46,080 మంది పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీటీవీ, డ్రోన్లు , బాడీవోర్న్ కెమెరాలను వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసిన వెంటనే, గంట విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుండటంతో సాయంత్రానికల్లా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

