కలం, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) లో జరిగిన ప్రమాదం 30 సంవత్సరాలలో ఎక్కడా జరగలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్నారు. విశాఖ పట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని కలిసి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. అలాగే, మృతుల కుటుంబాలను పవన్ పరామర్శించి ఓదార్చారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెళ్లి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం భరోసానిచ్చారు. క్షతగాత్రుల వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. గాయపడ్డవారికి అన్ని రకాల వైద్య సేవలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే, ప్రమాదంపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ లో నెలకొన్న సమస్యలపై త్వరలోనే కార్మికులతో చర్చిస్తామని వెల్లడించారు. కార్మికులతో తానే స్వయంగా మాట్లాడుతానని పవన్ కల్యాణ్ హామినిచ్చారు.
అంతకుముందు ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత మృతుల కుటుంబ సభ్యులను పరామర్వించి ధైర్యం చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆరా తీశారు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

