కలం, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్, పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.
ప్రధాని మోదీతో జరిగే భేటీలో విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు, విశాఖ బీచ్ కారిడార్ నిర్మాణాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని కోరనున్నారు. వీటితో పాటు గోదావరి జలాలు, నదుల అనుసంధానం వంటి కీలక అంశాలు కూడా ఈ చర్చల్లో రానున్నాయి.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగే సమావేశంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రహదారి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తారు. త్వరలో రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్రం నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు.

