ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ… కీలక నిర్ణయాలివే!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి (AP Cabinet) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి సుమారు 48 కీలక ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సుమారు రూ. 35,000 కోట్ల మేర పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే పలు పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలను ఇందులో పొందుపరిచారు.

ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలను క్యాబినెట్ ఆమోదించింది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సిలికాన్ క్రిస్టల్, వేఫర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు 91.10 ఎకరాల భూ కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు 5.84 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదం తెలపడమే కాకుండా, ఎనిమిది పరిశ్రమలతో పాటు ఇతర సంస్థలకు ‘అర్లీ బర్డ్ ఇన్సెంటివ్ స్కీమ్’ కింద మూలధన రాయితీలు మంజూరు చేసేందుకు సమ్మతించింది. ఈ నిర్ణయాలు ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని మార్చడమే కాకుండా, రాష్ట్రాన్ని హైటెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నీటిపారుదల, వ్యవసాయ రంగాలు, విద్యుత్ రంగానికి కూడా క్యాబినెట్ ప్రాధాన్యత ఇచ్చింది. కృష్ణా జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు రూ. 698.90 కోట్లు కేటాయించడంతో పాటు, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల కొనసాగింపునకు ఆమోదం తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీని పొడిగించారు. ఇంధన రంగానికి సంబంధించి ‘ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024’లో కొన్ని కీలక మార్పులకు ఆమోదం తెలపడంతో పాటు, కర్నూలు జిల్లాలో నూతన పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

మరోవైపు రాష్ట్రంలో ఇటీవల విరుచుకుపడిన ‘అర్నబ్’ తుఫాన్ వల్ల జరిగిన నష్టం, బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు, మంత్రివర్గం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రతికూల ప్రభావానికి గురైన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలవాలని క్యాబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. బాధితులకు తక్షణ పునరావాసం, ఆర్థిక సాయం అందించడంతో పాటు నష్టపోయిన మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>