కలం, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు (India Womens Cricket Team) అన్ని ఫార్మాట్ల కొత్త కెప్టెన్‌గా ఎంపికైన స్మృతి మంధానపై (Smriti Mandhana) మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా (Anjum Chopra) స్పందించారు. స్మృతి మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను అనుకరించాల్సిన అవసరం లేదని, తనదైన శైలిలో నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గువహటిలో జరిగిన సమీక్షా సమావేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు దక్కాయి. ఈ నిర్ణయం తర్వాత జింబాబ్వేతో జరగనున్న సిరీస్ కోసం జట్టు ఎంపికలోనూ స్మృతి భాగస్వామి అయ్యారు.
స్మృతి కొత్త ప్రయాణం అక్టోబర్ 16 నుంచి రాయ్‌పూర్‌లో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌తో మొదలుకానుంది. గతంలోనూ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉందని అంజుమ్ చోప్రా పేర్కొన్నారు. 2019లోనే స్మృతి తొలిసారిగా జట్టుకు నాయకత్వం వహించారని గుర్తుచేశారు. అంతేకాకుండా, మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు ట్రోఫీ అందించడం ఆమె నాయకత్వ పటిమకు నిదర్శనమని చెప్పారు.
ఇప్పటివరకు సంపాదించిన అనుభవంతో జట్టులోని లోపాలను సరిదిద్ది, భారత జట్టును తదుపరి స్థాయికి తీసుకెళ్లడమే స్మృతి ముందున్న అతిపెద్ద సవాలని అంజుమ్ విశ్లేషించారు. తొలిసారిగా భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతున్న జింబాబ్వేపై విజయంతో ప్రయాణాన్ని ప్రారంభించడం స్మృతికి కలిసివస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆటగాళ్లు కొత్త మార్పులకు అలవాటు పడతారని తెలిపారు. స్మృతి తన నిర్ణయాలతో భారత జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

