కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లా రేణిగుంటలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన అభయ ఆంజనేయస్వామి ఆలయ (Anjaneya Swamy Temple) కూల్చివేత వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయాన్ని తొలగించడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ కూల్చివేత పనులను ఆయన అడ్డుకున్నారు.
పల్లవ రాజుల కాలం నాటి ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని, అగస్త్య మహాముని, అన్నమయ్య వంటి మహనీయులు ఇక్కడ ఆంజనేయస్వామిని పూజించినట్లు చారిత్రక నేపథ్యం ఉందని భూమన పేర్కొన్నారు. ఇలాంటి పురాతన ఆలయాన్ని రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, హిందూ ఆలయాల పరిరక్షణ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే నాయకులు పురాతన ఆలయాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల సంరక్షణ ఇదేనా అంటూ ప్రభుత్వ తీరును నిలదీశారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ఆలయాలను అభివృద్ధి పనుల పేరుతో తొలగించకుండా పరిరక్షించాలని భూమన డిమాండ్ చేశారు. పురాతన ఆలయాల వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
Also Read : పశ్చిమ బెంగాల్‌కు కొత్త పేరు.. కేబినెట్ ఆమోదం!
Follow Us On: X(Twitter)

