కలం, నిర్మల్: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నాలుగు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవనగర్ ఆర్‌ఓబీ (Madhavanagar ROB) బైపాస్ వద్ద మంగళవారం ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏలేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సరైన అంచనాలు రూపొందించకపోవడం వల్లే నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శించారు. సవరించిన అంచనాల ప్రకారం పెరిగిన నిర్మాణ వ్యయానికి తక్షణమే పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల విడుదలలో జాప్యం చేయడం సరికాదన్నారు. పెండింగ్‌లో ఉన్న అనుమతులను వెంటనే మంజూరు చేసి, అదనపు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆర్‌ఓబీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

