ప్రపంచ నంబర్‌వన్‌గా జ్వెరెవ్.. 52 ఏళ్ల తర్వాత రికార్డ్

కలం, స్పోర్ట్స్: టెన్నిస్‌లో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (Alexander Zverev) ఎట్టకేలకు ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచారు. 29 ఏళ్ల వయసులో తొలిసారి ఈ ఘనత సాధించారు. ఏటీపీ ర్యాంకింగ్స్‌ ప్రారంభమైన తర్వాత అగ్రస్థానానికి చేరిన 30వ ఆటగాడిగా రికార్డు సృష్టించారు. 52 ఏళ్ల తర్వాత తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచిన అత్యంత పెద్ద వయసున్న ఆటగాడిగా గుర్తింపు పొందారు. జర్మనీ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచారు. గతంలో బోరిస్‌ బెకర్‌ మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నారు.

ఈ ఏడాది జ్వెరెవ్‌ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. జూన్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఫ్లావియో కొబొల్లిని ఓడించి టైటిల్‌ గెలిచారు. సెప్టెంబర్‌లో జరిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో బెన్‌ షెల్టన్‌ను ఓడించి రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నారు. వింబుల్డన్‌ ఫైనల్‌ వరకు చేరినా.. జానిక్‌ సిన్నర్‌ చేతిలో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ వరకు వెళ్లారు. గతంలో ఎన్నోసార్లు నంబర్‌వన్‌ రేసులోకి వచ్చినా.. జ్వెరెవ్‌కు ఆ స్థానం దక్కలేదు.

నాలుగేళ్లకు పైగా రెండో ర్యాంకులోనే ఉండిపోయారు. చివరకు ఈ సీజన్‌లో తన లక్ష్యాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 65 విజయాలు, 17 ఓటములతో కొనసాగారు. రెండు ఏటీపీ ఫైనల్స్‌ టైటిళ్లు, ఒలింపిక్స్‌ సింగిల్స్‌ స్వర్ణం, ఏడు మాస్టర్స్‌ 1000 టైటిళ్లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న జానిక్‌ సిన్నర్‌ రెండో ర్యాంకుకు పడిపోయారు. మోకాలి గాయం కారణంగా మూడు వారాల క్రితమే సీజన్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించారు. స్పెయిన్‌ ఆటగాడు కార్లోస్‌ అల్కరాజ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>