కలం, యాదగిరిగుట్ట: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన లప్ప నాయక్ తండా(Lappa Naik Tanda) నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి (Datharpally) గ్రామ సమీపంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాసిత కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సంక్షేమానికి, పునరావాసానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు. రూ. 26.50 కోట్లతో పునరావాస చర్యలు చేపట్టి, తొలి విడతగా 250 ప్లాట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేసి, వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
గతంలో నష్టపరిహారం కోసం తండా వాసులు ఉద్యమిస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీ మేరకు నష్టపరిహారంతో పాటు ఇంటి స్థలాలను కూడా అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేక కోటా కేటాయిస్తామని ప్రకటించారు. లప్ప నాయక్ తండాను ‘మినీ బంజారాహిల్స్’ తరహాలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాతే పాత తండాను ఖాళీ చేయిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నడుచుకునేది ప్రజా ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లప్ప నాయక్ తండా నిర్వాసిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

