కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మద్యం ధరలు (Alcohol Prices) పెరగబోతున్నాయి. తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ రెండో తేదీ తరువాత ఎప్పుడైనా పెంపు ప్రకటన ఉండొచ్చని ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. మద్యం రేట్లు ఎలా పెంచాలనే దానిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ 25 శాతం నుంచి 30 శాతం వరకు పెంచాలని సిఫార్సులు చేసింది. అయితే, ప్రభుత్వం మాత్రం 10–15 శాతం మేర పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించిన తరువాత.. దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
చమురు, గ్యాస్ ధరలు పెరగడంతోనే..
అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు, గ్యాస్ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం డిస్టిల్లరీలు, బ్రూవరీల కంపెనీలపై గట్టిగానే పడుతోంది. ఈ నేపథ్యంలో తమకు రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి. మరోవైపు, రాష్ట్ర ఆదాయం సైతం పడిపోతున్న తరుణంలో.. మద్యం ధరల పెంపు వలన ఖజానాపై ఒత్తిడి కొంత తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే లిక్కర్, బీర్ల రేట్లు పెరిగే అవకాశం ఉందని సమాచారం.

