కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ పట్టింపుగా వ్యవహరించడం లేదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్ లో విద్యారంగంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం, బడ్జెట్ కోతలు, నెరవేరని హామీలపై ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో దాదాపు రూ.11,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని మణికంఠ రెడ్డి (Kasireddy Mani Kanta Reddy) పేర్కొన్నారు. సర్టిఫికెట్లు చేతికి రాక ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు అప్లై చేసుకోలేక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల లేమి చాలా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నేటికీ కనీస మౌలిక సదుపాయాలైన సరిపడా తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ల్యాబొరేటరీలు, గ్రంథాలయాలు లేవని మణికంఠ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా విద్యారంగ అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన.. హామీల బురిడీ..
కేజీ టు పీజీ ఉచిత విద్యఅందిస్తామని.. తెలంగాణ వస్తే ఉచిత, నాణ్యమైన విద్య అందుతుందని చెప్పిన కేసీఆర్ పదేళ్ల పాలనలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకే పెద్దపీట వేసి ప్రైవేటీకరణను ప్రోత్సహించారని అన్నారు.
లీకేజీలు – నిరుద్యోగుల ఆత్మహత్యలు..
TSPSC పేపర్ లీకేజీలు, ఇంటర్ ఫలితాల అవకతవకల కారణంగా 24 మంది అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి, కానిస్టేబుల్, గ్రూప్స్ పరీక్షల గందరగోళానికి కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. “ఇంటికో ఉద్యోగం” అని చెప్పి నిరుద్యోగ యువతను దగా చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మారని తీరు..
బడ్జెట్‌లో విద్యకు 30% నిధులు ఇవ్వాలని విద్యార్థి లోకం కోరుతుంటే, గత కేసీఆర్ ప్రభుత్వం 9% ఇస్తే… ఎన్నికల్లో 15% ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని మణికంఠ విమర్శించారు.
నెరవేరని ఎన్నికల హామీలు..
అధికారంలోకి రాగానే ఒకేసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామన్న మాట ఏమైందని మణికంఠ ప్రశ్నించారు. విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, రూ.5 లక్షల విద్య భరోసా కార్డు, ఉచిత ఇంటర్నెట్ వంటి హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయన్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
మత రాజకీయాలకు దూరంగా ఉండండి..
విద్యార్థులను కులం, మతం పేరుతో విభజించడం విద్యార్థి సమాజానికి శ్రేయస్కరం కాదని, చదువు, ఉద్యోగం, ఫీజుల సాధన కోసం విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
సమస్యలు పరిష్కరించాలి..
గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ కేంద్రాలను విస్తరించి, నాణ్యమైన స్టడీ మెటీరియల్, డిజిటల్ వసతులు అందుబాటులోకి తేవాలన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్, డ్రగ్స్, వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటూ, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని కసిరెడ్డి మణికంఠ డిమాండ్ చేశారు.

