కలం, వెబ్ డెస్క్ : జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) (AI 2030) విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. హైజాక్ హెచ్చరికపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు విమానాన్ని అత్యవసరంగా రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ పూర్తయిన వెంటనే విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేకి తరలించి, ప్రయాణికులను మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
భద్రతా కారణ దృష్ట్యా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి విమానంలో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికుల లగేజీతో పాటు విమానంలోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

