కలం, వెబ్‌డెస్క్: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో (AP Panchayat Elections) ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు చోట్ల నామినేషన్ల ప్రక్రియ నుంచి తీవ్ర ఉద్రిక్త సంఘటనలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓట్ల కోసం అభ్యర్థులు భారీగా డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎన్నికల్లో ఓట్లు అమ్ముకోవద్దని పిలుపునిస్తూ, తన ఇంట్లో ఓట్లను డబ్బుతో ఎవరూ కొనలేరని పేర్కొంటూ సదరు వ్యక్తి ఆసక్తికర ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఫిరంగిపురానికి చెందిన ప్రభుత్వ టీచర్ వక్కలగడ్డ శ్రీనివాసరావు ఓటు విలువను చాటిచెప్తూ తన ఇంటి ముందు ఈ ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో తమ ఇంట్లో ఓట్లు ఎవరికీ అమ్మబడవని, తమ పేరు చెప్పి ఏ అభ్యర్థి వద్ద నుండైనా, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఎవరైనా డబ్బులు ఇస్తే తమ ఖర్మ అని రాసుకొచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి మంచి వ్యక్తులకు ఓటు వేయాలన్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడే వారికే ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. చదువుకున్నా, చదువుకోకపోయినా ప్రతి ఒక్కరికి ఎవరు మంచి వారో, ఊరికి ఎవరు మంచి చేస్తారు అనే విషయం తెలుసునన్నారు. చదువుకున్న వారి ఓట్లను అభ్యర్థులు నేరుగా కొనలేక మధ్య వర్తులను, దళారులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఆ దళారులు కొందరి పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

