కలం, నిర్మల్: శివాజీ బీడీ కార్మికులు (Shivaji Beedi Workers) తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీ నుంచి చేపట్టిన సమ్మె నేపథ్యంలో, శనివారం నిర్వహించిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కార్మిక శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యం రెడ్డి, నిర్మల్ లేబర్ ఆఫీస్ అధికారి రాజలింగం సమక్షంలో కార్మిక సంఘం ప్రతినిధులు, శివాజీ బీడీ యాజమాన్య ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి.
ఈ చర్చల్లో కార్మికులకు అదనంగా రెండు రోజుల పని దినాలు కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. అలాగే నాణ్యమైన తునికాకును సరఫరా చేయడంతో పాటు బ్రాంచీలలో ఉన్న నాసిరకం తునికాకును వెనక్కి తీసుకుంటామని, చాట్ బీడీ ఉత్పత్తిని తగ్గిస్తామని అంగీకరించింది. కార్మికుల ఇతర సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు నిజామాబాద్‌లో మరో విడత చర్చలు నిర్వహించాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రాజన్న, ఆర్. రామలక్ష్మణ్, శివాజీ బీడీ యాజమాన్యం జనరల్ సూపర్‌వైజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

