కలం, వెబ్ డెస్క్ : ఎంఐఎం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ (Mirza Rahmath Baig)ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేయాలని, రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్‌కు సమర్పించాలని ఎంఐఎం అధిష్టానం ఆదేశించింది. పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ పేరిట ఈ ప్రకటన విడుదలైంది.
ఈ బహిష్కరణ నిర్ణయం వెనుక తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్తాపూర్ పరిధిలో మీర్జా రహ్మత్ బేగ్ ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా కొందరు యువకులు పట్టుకుని, దేహశుద్ధి చేసి వీడియోలు తీశారని ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ ఆరోపించారు. ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలిసినా, మొదట రహ్మత్ బేగ్‌ను ఉమ్రా యాత్రకు పంపించారని, ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండా సస్పెండ్ చేశారని సబ్దర్ అలీ విమర్శించారు.
మరోవైపు, హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ (Mirza Rahmath Baig) చేసిన అకృత్యాల నిజస్వరూపం నగరం మొత్తానికి తెలియాలని, అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా నోరు విప్పి రహ్మత్ బేగ్‌ను ఎందుకు తొలగించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంఐఎంకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక కార్పొరేటర్ పాత్ర కూడా ఉందనే ఆధారాలు తన వద్ద ఉన్నాయని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. మహిళలను గౌరవించాలని, హిజాబ్ గురించి మాట్లాడే ఎంఐఎం పెద్దలు తమ నాయకుల అకృత్యాలపై సమాధానం చెప్పాలని, తన వద్ద ఉన్న ఆధారాలన్నీ అధినేత ముందు ఉంచుతానని పేర్కొన్నారు.

