నల్లగొండలో అఖిల భారత కిసాన్ మహాసభలు

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) వేదికగా అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు మర్రిగూడెం బైపాస్ నుంచి ఎన్‌జీ కాలేజీ మైదానం వరకు వైభవంగా మహా ప్రదర్శన జరగనుంది. రెడ్ షర్ట్ వలంటీర్లు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత పెద్దఎత్తున తరలిరానున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రముఖ రాజకీయ, రైతు ఉద్యమ నేతలు ప్రసంగించను న్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు బృందా కరత్ ప్రధాన వక్తగా హాజరుకానుండగా, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తదితరులు దిశానిర్దేశం చేయనున్నారు.

జీఎం కన్వెన్షన్ వేదికగా జాతీయ ప్రతినిధుల సభ

ఆదివారం నుంచి ఈనెల18 వరకు జీఎం కన్వెన్షన్ సెంటర్‌లో జాతీయ ప్రతినిధుల సభ జరగనుంది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1,200 మంది ప్రతినిధులు, పరిశీలకులు కలిపి 2 వేల మంది వరకు హాజరవుతున్నారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం, గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, పంటల కొనుగోళ్లు, రైతుల రుణభారం, వ్యవసాయ కార్మికుల ఉపాధి, సాగునీటి సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, కార్పొరేట్ సంస్థల ప్రభావం వంటి సమకాలీన కీలకాంశాలపై ఈ వేదికపై విస్తృతంగా చర్చించనున్నారు. దేశ వ్యవసాయ పరిరక్షణకు భవిష్యత్‌లో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను ఇక్కడ ఖరారు చేయనున్నారు.

125 స్టాళ్లతో భారీ అగ్రి షో

మహాసభలకు అనుబంధంగా నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ వ్యవసాయ ప్రదర్శన (అగ్రి షో) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన 125 స్టాళ్లలో అగ్రి డ్రోన్లు, ఆధునిక ట్రాక్టర్లు, విత్తనాలు, ఎరువులు, డ్రిప్-స్ప్రింక్లర్ పరికరాలు కొలువుదీరాయి. ముఖ్యంగా నల్లగొండ ప్రాంత సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ఆధునిక సాగు పద్ధతులు, పామాయిల్ సాగు మెలకువాలపై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రతినిధులు రైతులకు ఉచితంగా సలహాలు అందిస్తుండటంతో అన్నదాతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్టాళ్లను సందర్శిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>