కలం, స్పోర్ట్స్ : దేశంలో ఫుట్‌బాల్ క్రీడను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) సంచలన నిర్ణయం తీసుకుంది. 2026-27 సబ్ జూనియర్ బాలుర, బాలికల జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో కొత్త మ్యాచ్ ఫార్మాట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. యువ ఆటగాళ్లలో ప్రతిభను, మ్యాచ్ తీవ్రతను పెంచేందుకు ఫిఫా U15 ప్రపంచ కప్ మార్గదర్శకాల ఆధారంగా ఈ మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం మ్యాచ్‌లను ‘8 V 8’ పద్ధతిలో నిర్వహిస్తారు. అర్ధభాగం 20 నిమిషాల చొప్పున మొత్తం రెండు హాఫ్‌లు ఉంటాయి.
మధ్యలో ఐదు నిమిషాల విరామం ఇస్తారు. మైదానం పొడవు 68 మీటర్లు, వెడల్పు 50 మీటర్లుగా నిర్ణయించారు. ఇందులో ఆఫ్‌సైడ్ లైన్‌ను 23 మీటర్ల వద్ద గుర్తిస్తారు. ఈ టోర్నీలో ‘అన్‌లిమిటెడ్ రోలింగ్ సబ్‌స్టిట్యూషన్స్’ పద్ధతికి అనుమతి ఇచ్చారు. అంటే ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతున్నప్పుడే హాఫ్‌వే లైన్ నుంచి ఎన్నిసార్లైనా మైదానంలోకి వెళ్లి రావచ్చు. అయితే గోల్‌కీపర్లను మార్చాలంటే మాత్రం ఆటను నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రతీ మ్యాచ్ ముగిసిన తర్వాత నాకౌట్ దశకు ముందు ఒక రోజు విశ్రాంతి ఇస్తారు.
ఈ సిరీస్ కోసం ఒక్కో జట్టు ఏఐఎఫ్ఎఫ్ సిస్టమ్‌లో 50 మంది ఆటగాళ్లను నమోదు చేసుకోవచ్చు. తొలి మ్యాచ్‌కి ఐదు రోజుల ముందు కనీసం 12 నుంచి గరిష్టంగా 16 మందితో తుది జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఏఎఫ్‌సీ U17 ఆసియా కప్ 2027 అర్హత పోటీల ప్రిపరేషన్స్‌లో భాగంగా భారత U17 మహిళల జట్టు సెప్టెంబర్ 26, 29 తేదీల్లో ఫిలిప్పీన్స్‌తో రెండు స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనుంది. గోవాలో జరిగే ఈ పోటీల ద్వారా మన అమ్మాయిలు అనుభవాన్ని గడించనున్నారు.

